Pashamylaram

Pashamylaram: సంగారెడ్డి పాశమైలారం రసాయన పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

Pashamylaram: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం రసాయన పరిశ్రమ సిగాచి వద్ద సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు కార్మికులు ఇంకా పరిశ్రమ లోపల చిక్కుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమవారి ఆచూకీ తెలియక కార్మికుల కుటుంబాలు పరిశ్రమ వద్దకు చేరుకొని తీవ్ర ఆందోళన చెందాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘటనాస్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పేలుడు వార్త తెలియగానే, తమ కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుసుకోవడానికి వందలాది మంది బంధువులు సిగాచి పరిశ్రమ వద్దకు పరుగులు తీశారు. తమవారిని కోల్పోయిన బాధతో, మరికొందరు ఆచూకీ తెలియక ఆవేదనతో పరిశ్రమ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. తమవారి ఆచూకీ చెప్పాలంటూ, లోపలికి వెళ్లనివ్వాలంటూ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Also Read: Asaduddin owaisi: ఎన్డీఏని ఓడించడమే లక్ష్యం – మహాకూటమితో పొత్తుకు ప్రయత్నాలు

Pashamylaram: సోమవారం మధ్యాహ్నం సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాద సమయంలో పరిశ్రమలో సుమారు 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కూలిపోగా, మరో భవనానికి కూడా బీటలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *