Temples Closed: సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి భారతదేశం అరుదైన ఖగోళ సంఘటనకు సాక్ష్యమవుతుంది. రాత్రి 8:58 గంటలకు ప్రారంభమయ్యే సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11:41 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకోనుంది. ఈ సందర్భంగా చంద్రుడు ఎరుపు-నారింజ రంగులో మెరిసి బ్లడ్ మూన్ రూపంలో కనిపించనున్నాడు. రాత్రి 1:23 గంటలకు చంద్రగ్రహణం పూర్తిగా విముక్తి చెందుతుంది. ఈ ఖగోళ సంఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD):
తిరుమల శ్రీవారి ఆలయం ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు మూసివేయబడుతుంది. సోమవారం తెల్లవారుజామున సుప్రభాతం, ఆలయ శుద్ధి అనంతరం ఉదయం 3 గంటల నుంచే దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని TTD అధికారులు తెలిపారు. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుంది. ఈ సమయంలో అన్ని దర్శనాలు, అన్నప్రసాద కేంద్రం మూసివేయబడతాయి. భక్తుల సౌకర్యం కోసం 50 వేల పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
శ్రీశైలం ఆలయం:
నంద్యాల జిల్లాలోని శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయం సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 1 గంట నుండి సెప్టెంబర్ 8 ఉదయం 5 గంటల వరకు మూసివేయబడుతుంది. ఈ సమయంలో అన్ని ఆర్జిత సేవలు నిలిపివేయబడతాయి. ఆలయ శుద్ధి అనంతరం ఉదయం 7:30 గంటల నుండి మహామంగళహారతితో దర్శనాలు ప్రారంభం అవుతాయి.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం (విజయవాడ):
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మూసివేసి, సోమవారం తెల్లవారుజామున శుద్ధి పూజల అనంతరం ఉదయం 8:30 గంటల నుండి దర్శనాలు ప్రారంభం అవుతాయి.
ఇది కూడా చదవండి: High Tension Wires: నిమజ్జనం వేడుకల్లో విషాదం.. హై-టెన్షన్ వైర్లు తగిలి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం:
యాదగిరిగుట్టలో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుంది. సాయంత్రం నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాలు రద్దు చేశారు. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రారంభం అవుతాయి.
జోగులాంబ గద్వాల జిల్లా:
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయం మధ్యాహ్నం 1 గంట నుంచి సోమవారం ఉదయం 6:30 వరకు మూసివేయబడుతుంది. మహామంగళహారతి అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభం అవుతుంది.
భద్రాచలం రామాలయం:
భద్రాచలం ఆలయం ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు మూసివేయబడుతుంది. శుద్ధి అనంతరం ఉదయం 7:30 గంటల నుండి దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.
వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాలు:
-
భద్రకాళి అమ్మవారి ఆలయం మధ్యాహ్నం 1 గంట వరకు పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు.
-
1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం, కాలేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం సహా ప్రధాన ఆలయాలు ద్వారబంధనం చేయనున్నాయి.
శ్రీకాళహస్తి ఆలయం ప్రత్యేకత:
గ్రహణ సమయంలో సాధారణంగా ఆలయాలను మూసివేస్తారు. అయితే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం పూజలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఈ ఆలయం గ్రహణ గండాలకు అతీతమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
గ్రహణ సమయంలో పాటించవలసిన సూచనలు:
పండితులు, జ్యోతిష్కుల సూచనల ప్రకారం:
-
సాయంత్రం 6 గంటల లోపే భోజనం ముగించాలి.
-
గ్రహణ సమయంలో పూజలు, ముఖ్య నిర్ణయాలు, ప్రయాణాలు నివారించడం శ్రేయస్కరం.
-
ఇంటి పూజా మందిరం, ఆహార పదార్థాలపై దర్భలు ఉంచడం శుభప్రదం.
-
గ్రహణ అనంతరం స్నానం చేసి పుణ్య స్నానం చేయడం ఆచారం.
భక్తుల సూచన:
చంద్రగ్రహణం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూసివేయబడుతున్నందున, భక్తులు తమ యాత్రలను ఈ షెడ్యూల్‌కి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.