UP Temple: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో శ్రావణ సోమవారం నాడు చోటుచేసుకున్న ఒక విషాద ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. హైదర్‌గఢ్‌లోని ఔసానేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.
శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో, ఆలయ ప్రాంగణంలో ఉన్న పాత విద్యుత్ తీగలపై కొన్ని కోతులు దూకాయి. దీంతో ఒక విద్యుత్ తీగ తెగి, సమీపంలోని టిన్ షెడ్‌పై పడింది. షెడ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో అక్కడున్న దాదాపు 19 మంది భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది.
Also Read: EasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడు
విద్యుత్ షాక్ తగలడంతో భక్తుల్లో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. భయంతో పరుగులు తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా తీవ్ర గాయాలపాలైన ఇద్దరు భక్తులు మరణించారు. మృతుల్లో ఒకరిని లోనికాత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్‌పురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్‌గా గుర్తించారు. మరో ఐదుగురి వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారందరినీ త్రివేదిగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి ఈ ఘటనపై స్పందించారు. కోతుల వల్లే విద్యుత్ తీగ తెగిపడిందని, దీంతో భక్తులకు విద్యుత్ షాక్ తగిలిందని, ఆందోళనతో తొక్కిసలాట జరిగిందని ఆయన వివరించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన మర్చిపోకముందే, ఇలాంటి మరో విషాదం ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకోవడం విచారం వ్యక్తం చేస్తోంది.