USA

USA: అమెరికాలో తెలుగు యువతి నికిత రావు దారుణ హత్య!

USA: అమెరికాలో ఉన్నత చదువులు చదివి, కెరీర్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఒక తెలుగు యువతి ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మేరీల్యాండ్‌లో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల గొడిశాల నికితా రావు, తన మాజీ స్నేహితుడు అర్జున్ శర్మ చేతిలోనే దారుణ హత్యకు గురైనట్లు అమెరికా పోలీసులు ప్రాథమిక ఆధారాలతో నిర్ధారించారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో అదృశ్యమైన ఆమె, చివరకు కొలంబియాలోని తన మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లోనే విగతజీవిగా కనిపించడం పెను సంచలనం సృష్టించింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, డిసెంబర్ 31వ తేదీ నుంచి నికిత ఆచూకీ లేకుండా పోయింది. అయితే, నిందితుడు అర్జున్ శర్మ పోలీసులను తప్పుదోవ పట్టించేలా అత్యంత తెలివిగా వ్యవహరించాడు. జనవరి 2న తానే స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి నికిత కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 31న ఆమెను చివరిసారిగా ఎల్లికాట్ సిటీలో చూశానని అబద్ధపు సమాచారం ఇచ్చి, అదే రోజు హుటాహుటిన అమెరికా వదిలి భారత్‌కు పారిపోయాడు. అర్జున్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు సెర్చ్ వారెంట్‌తో అతని అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేయగా, అక్కడ నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన గుర్తులను అధికారులు గుర్తించారు.

Also Read: Tanakallu: పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణ హత్య: తనకల్లులో కలకలం

ప్రస్తుతం అర్జున్ శర్మపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతను ఇప్పటికే భారతదేశానికి చేరుకున్నట్లు సమాచారం అందడంతో, అతడిని పట్టుకునేందుకు అమెరికా ఫెడరల్ అధికారులు భారత ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన నికిత, జేఎన్‌టీయూలో ఫార్మసీ పూర్తి చేసి మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లింది. అక్కడ ‘వెడా హెల్త్’ అనే సంస్థలో పనిచేస్తూ ఉత్తమ ఉద్యోగిగా ‘ఆల్-ఇన్’ అవార్డును కూడా అందుకుంది. ఒక ప్రతిభావంతురాలైన యువతి ఇలాంటి ఘాతుకానికి బలికావడంపై వాషింగ్టన్‌లోని భారత ఎంబసీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నికిత కుటుంబానికి న్యాయం జరిగేలా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *