Film Chamber: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వేతనాల పెంపు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది. మీడియాకు విడుదల చేసిన ఒక లేఖ ద్వారా, ప్రస్తుత పరిస్థితుల్లో వేతనాల పెంపు చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదని, ఇది పరిశ్రమకు మరింత నష్టం కలిగిస్తుందని ఛాంబర్ స్పష్టం చేసింది.
యూనియన్ల డిమాండ్లపై ఫిలిం ఛాంబర్ అసంతృప్తి
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలుగు ఫిలిం ఛాంబర్ తన లేఖలో పేర్కొంది. ఇటువంటి సమయంలో, కార్మిక శాఖ కమిషనర్ మార్గదర్శకత్వంలో సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ, ఫెడరేషన్ కమిషనర్ మాటను ధిక్కరించి ఆగస్టు 3, 2025న ఒక నిర్ణయం తీసుకుందని ఛాంబర్ ఆరోపించింది.
ఆ నిర్ణయం ప్రకారం, ఆగస్టు 4, 2025 నుండి 30% వేతనాలు పెంచాలని, ప్రొడ్యూసర్ నుండి సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, ఆ లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియ చేసిన తర్వాతే విధులకు వెళ్లాలని నిర్ణయించడం “చాలా బాధాకరం” అని ఛాంబర్ అభిప్రాయపడింది. ఇది నిజాయితీతో కూడిన చర్చల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని పేర్కొంది.
చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాలు పెంచాలని యూనియన్లు డిమాండ్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఆ పెంపును వారు భరించే స్థితిలో లేరని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది. ప్రతి చిన్న నిర్మాత ఈ పెంపుదలకు వ్యతిరేకంగా ఉన్నారని కూడా గమనించాలని సూచించింది. అందువల్ల, ప్రస్తుత పరిస్థితుల్లో భరించలేని ఈ పెంపును నిర్మాతలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించినట్లు తీర్మానం చేసింది.
Also Read: Dulquer Salmaan: దుల్కర్ న్యూ లవ్ స్టోరీ
కనీస వేతనాలు, సీసీఐ నిబంధనలు:
కార్మిక శాఖ కమిషనర్ స్పష్టతనిస్తూ, కనీస వేతనాల చట్టం ప్రకారం, కనీస వేతనాలు చెల్లించే ఏ కార్మికుడిని అయినా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని తెలిపారు. అంతేకాకుండా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా నిర్మాతల స్వయంప్రతిపత్తిని సమర్థిస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసిందని, ఫెడరేషన్ల ఒత్తిడి, పోటీని నిరోధించే పద్ధతులను ఖండిస్తూ అలాంటి నిబంధనలను అమలు చేయకుండా నిరోధించిందని ఛాంబర్ గుర్తు చేసింది.
కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువగా ఉన్నప్పటికీ, అన్ని యూనియన్ల వారికి ఎక్కువ వేతనాలు చెల్లించడం జరుగుతుందని ఫిలిం ఛాంబర్ తెలిపింది. ఇతర రాష్ట్రాల చలన చిత్ర పరిశ్రమలో ఇచ్చే వేతనాల కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పని చేసే కార్మికులకు అధిక వేతనాలు చెల్లిస్తున్నామని వివరించింది.
“నైపుణ్యం ఉన్న కార్మికుల పొట్ట కొట్టొద్దు!” – ఛాంబర్ తీర్మానం:
ఈ పరిస్థితుల నేపథ్యంలో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఏకగ్రీవంగా ఒక ముఖ్యమైన తీర్మానం చేసింది. దీని ప్రకారం:
నిర్మాతలు ఎవరైతే నైపుణ్యం కలిగిన కార్మికులు తామివ్వగలిగే వేతనానికి పనిచేస్తారో, వారు ఏ యూనియన్‌లో ఉన్నా లేకపోయినా వారితో షూటింగ్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎంతోమంది ఔత్సాహిక నిపుణులు/కార్మికులు ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, యూనియన్లలో సభ్యత్వం కోసం లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ వారి ప్రవేశానికి సదరు యూనియన్లు అవరోధం కలిగిస్తున్నాయని ఛాంబర్ ఆరోపించింది.
“ఇది ఎంతో మంది నైపుణ్యవంతులైన కార్మికుల పొట్ట కొట్టడమే” అని ఛాంబర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రతి ప్రాజెక్టు అవసరాలు, వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా కార్మికులతో కలిసి పనిచేసే పూర్తి స్వేచ్చ నిర్మాతలకు ఉంటుందని స్పష్టం చేసింది.
ఎవరైనా ఔత్సాహిక నిపుణులు/కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే, వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనికి లక్షలాది రూపాయలు సభ్యత్వం కోసం కట్టాల్సిన పని లేదని ఛాంబర్ తేల్చి చెప్పింది.
“నైపుణ్యం ఉన్న కార్మికునికి పని కల్పించడమే మా ధ్యేయం” అని ఛాంబర్ ప్రకటించింది.
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి పరిశ్రమలోని అనేక రంగాలలో పని చేసే కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర భాగస్వాములతో కలిసి పని చేస్తూ ఒక సానుకూల నిర్ణయం వైపు కృషి చేస్తుందని కె.యల్. దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. “నిర్మాత లేనిదే సినిమా పరిశ్రమ లేదు. మన ఫిలిం ఇండస్ట్రీ మనుగడ కోసం నిర్మాత శ్రేయస్సు అతి ముఖ్యమైన విషయం అని కార్మిక సంఘాలు మరొక్కసారి గుర్తించాలి” అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
