Telegram CEO: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) మరోసారి వార్తల్లోకి వచ్చారు. గతంలో తాను 100 మందికి పైగా పిల్లలకు జీవసంబంధమైన తండ్రినని చెప్పిన పావెల్, ఇప్పుడు ఆ పిల్లలందరికీ తన భారీ సంపదను పంచుతానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గత ఏడాది జూలైలో పావెల్ ఒక పోస్ట్ ద్వారా తాను గత 15 సంవత్సరాలుగా చేసిన వీర్యదానం వల్ల ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో 100 మందికి పైగా పిల్లలు జన్మించారని వెల్లడించారు. అప్పట్లో ఒక స్నేహితుడు తనకి పిల్లలు పుట్టడం లేదని సహాయం కోరడంతో వీర్యదానం చేయడం ప్రారంభించానని, అప్పటి నుండి అనేక జంటలకు సంతానం కలిగించానని చెప్పారు. తాను వీర్యదానం చేయడం ఆపేసినా, ఇంకా తన నిల్వ చేసిన కణాల ద్వారా చాలా కుటుంబాలు పిల్లలను పొందుతున్నాయని తెలిసిందని ఆయన ఆ పోస్ట్‌లో వివరించారు.
తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పావెల్ ఈ విషయంపై మరింత వివరంగా మాట్లాడారు. తాను ఇటీవల ఒక వీలునామా (Will) రాశానని, అందులో తనకి సహజంగా జన్మించిన సంతానంతో పాటు, వీర్యదానం ద్వారా జన్మించిన ఈ 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని పేర్కొన్నారు. తన సుమారు 20 బిలియన్ డాలర్ల (సుమారు ₹1,66,000 కోట్లు) సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని వీలునామాలో రాసినట్లు తెలిపారు. అయితే, ఈ సంపదను వారు 30 ఏళ్లు వచ్చే వరకు పొందలేరని ఆయన చెప్పారు. పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని కోరుకుంటున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పావెల్ వివరించారు.
Also Read: Shubman Gill: ఐపీఎల్ కన్నా టెస్టు సిరీస్ గెలుపే గొప్ప గౌరవం: శుభ్‌మన్ గిల్
Telegram CEO: పావెల్ దురోవ్ వివాహం చేసుకోనప్పటికీ, తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని, వారికి కలిపి ఆరుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. తన జీవితం ఎన్నో సవాళ్లతో నిండి ఉందని, తనకు చాలా మంది శత్రువులు కూడా ఉన్నారని చెప్పారు. అందుకే, 40 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే తాను వీలునామా రాయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది, చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పావెల్ దురోవ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.