Telangana:తెలంగాణ రాజకీయాల్లో గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకున్నదని ప్రచారం జరుగుతున్న వేళ బీఆర్ఎస్ కీలక నేతలైన మాజీ మంత్రులు, హరీశ్‌రావు, కేటీఆర్‌లను సిట్ విచారణకు పిలిచింది. ఇప్పటికే హరీశ్‌రావును విచారించిన సిట్.. మరో మారు పిలువనున్నట్టు తెలుస్తున్నది. తాజాగా సిట్ పిలుపు మేరకు కేటీఆర్ శుక్రవారం (జనవరి 23న) విచారణకు హాజరవుతున్నారు. దీంతో అంతటా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్నది.
Telangana:ఇప్పటి వరకూ పోలీస్ అధికారుల విచారణ పూర్తయిందని, గత ప్రభుత్వంలోని పెద్దల విచారణ మిగిలిందని వార్తలు అందుతున్నాయి. మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్‌రావు ఇచ్చిన క్లూతోనే ఈ విచారణ మరింత ముందుకు సాగుతున్నదని తెలుస్తున్నది. ఈ దశలోనే హరీశ్‌రావు కేటీఆర్ విచారణకు సిట్ పిలిచిందని వార్తలు వస్తున్నాయి. సంచలన పరిణామం చోటుచేసుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా సిట్ విచారణకు పిలుస్తుందని లీకులు వస్తున్నాయి. కేసు విచారణ అంతిమ దశలో ఈ పరిణామం చోటుచేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Telangana:ఇది రాజకీయ వేధింపులని, కేసు సాగతీత కోసమే ఇలాంటి డమ్కీలు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ కేసులో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని, ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢచారి వ్యవస్థ అని, అది పోలీసు అధికారుల చేతుల్లోనే ఉంటుందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇది ఓ లొట్టపీసు కేసు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బరాబర్ సిట్ విచారణకు హాజరవుతానని తేల్చి చెప్పారు. తమ వల్ల ఎలాంటి తప్పూ జరగలేదని, భయపడే సమస్యే లేదని స్పష్టం చేస్తున్నారు.
Telangana:ఇదిలా ఉండగా, ఆనాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ఆనాటి ప్రతిపక్ష, నేటి అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఆనాటి ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. అందుకే పకడ్బందీగా విచారణ సాగుతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని వారు చెప్తున్నారు.
సిట్ విచారణకు బయలుదేరిన కేటీఆర్
Telangana:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణకు శుక్రవారం ఉదయం బయలుదేరారు. సిట్ విచారణ నేపథ్యంలో హరీశ్‌రావు హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆయనతోపాటు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడి నుంచి కేటీఆర్, హరీశ్‌రావు ఇతర నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ మీడియా సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తారు.
