Telangana:

Telangana: స‌ర్పంచ్‌, ఉప స‌ర్పంచ్ చెక్‌ప‌వ‌ర్‌పై స‌ర్కార్ కీల‌క ఆదేశాలు

Telangana:తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయ‌తీల నిధుల నిర్వ‌హ‌ణ‌లో స‌ర్పంచ్‌, ఉప స‌ర్పంచ్‌ల‌కు ఉమ్మ‌డి సంత‌కం కీల‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో రాజకీయ విభేదాల‌తో, స్వార్థ‌పూరితంగా, అవ‌కాశ‌వాదంతో వ్య‌వ‌హ‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌ల‌ను జారీచేసింది. ఉప స‌ర్పంచ్ ప్ర‌మేయం లేకుండా స‌ర్పంచులు ఫోర్జ‌రీ సంత‌కం చేసినా, స‌ర్పంచ్‌తో విభేదాల‌తో ఉప స‌ర్పంచ్ సంత‌కం పెట్ట‌కుండా అభివృద్ధిని అడ్డుకున్నా ప‌ద‌వుల నుంచి తొల‌గించ‌డ‌మే కాకుండా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌లు జారీచేసింది.

Telangana:గ్రామ పంచాయ‌తీ నిధుల విన‌యోగానికి సంబంధించిన ప్ర‌తి నిర్ణ‌యం క‌చ్చితంగా గ్రామ స‌భ తీర్మానం ద్వారానే అమ‌లు చేయాల‌ని ఆదేశాలు ఉన్నాయి. న‌గ‌దు లావాదేవీల‌కు బ‌దులు అన్‌లైన్ చెల్లింపుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని స‌ర్కారు సూచించింది. నిధుల ఖ‌ర్చుల వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రికార్డుల్లో న‌మోదు చేసి ఉంటే ఆడిట్ త‌నిఖీల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండ‌బోవ‌ని పేర్కొన్న‌ది.

Telangana:ప్ర‌భుత్వ ప్ర‌జాధ‌నాన్ని వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు వాడ‌టం, ప‌నులు పూర్తికాకుండా బిల్లులు పొంద‌డం, త‌ప్పుడు లెక్క‌లు చూప‌డం, సంత‌కాల ఫోర్జ‌రీ వంటి చ‌ర్య‌లు తీవ్ర‌మైన నేరాలుగా ప‌రిగ‌ణించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇలాంటి అక్ర‌మ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి, ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డ‌మే కాకుండా జైలు శిక్ష విధించే అధికారం జిల్లా క‌లెక్ట‌ర్‌కు పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో పేర్కొన్న‌ట్టు తెలిపింది.

Telangana:కొన్ని గ్రామాల్లో స‌ర్పంచ్‌, ఉప స‌ర్పంచ్ మ‌ధ్య ఆధిప‌త్య పోరే గ్రామాభివృద్ధి ప్ర‌ధాన అవ‌రోధంగా మారుతుంద‌ని అధికారులు గుర్తించారు. రాజ‌కీయ కార‌ణాల‌తో కావాల‌నే బిల్లుల‌పై సంత‌కాలు చేయ‌కుండా ఉండేవారిపై ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్వ‌య‌హారిస్తుంద‌ని హెచ్చ‌రించింది. విచార‌ణ‌లో అభివృద్ధిని నిజంగా అడ్డుకున్న‌ట్టు తేలితే ఉప స‌ర్పంచ్‌కు ఉన్న చెక్‌ప‌వ‌ర్‌ను ర‌ద్దు చేసే అధికారం క‌లెక్ట‌ర్ ఉన్న‌ద‌ని తేల్చి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *