Telangana Rains

Telangana Rain: తెలంగాణకు రెడ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

Telangana Rain: మహారాష్ట్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండగా, రానున్న గంటల్లో మరింత ఉధృతంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాయుగుండం ప్రభావం తీవ్రం

వాయవ్య, మధ్య బంగాళాఖాతం పరిధిలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పూరీ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా సుమారు 60 కి.మీ దూరంలో, గోపాల్‌పూర్‌కు తూర్పు దిశలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతూ, ఈరోజు గోపాల్‌పూర్ సమీపంలో దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీనితో పాటు తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు.

  • ఆరెంజ్ అలర్ట్: నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు.

  • ఎల్లో అలర్ట్: ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్.

ఇది కూడా చదవండి: Andaman Sea: అండమన్‌ దీవుల్లో నేచురల్‌ గ్యాస్‌!

హైదరాబాద్‌లో జలమయం

గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం వరకూ హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లన్నీ జలమయమై, పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. మియాపూర్-కొండాపూర్ రైల్వే అండర్‌పాస్, హబ్సిగూడ, తార్నాక, చార్మినార్, కూకట్పల్లి, బాచుపల్లి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా ప్రభావం చూపింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఐటీ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

భారీ వర్షాలు, వాయుగుండం ప్రభావం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ప్రమాదం ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *