Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి రవాణా శాఖ ఊరటనిచ్చే వార్త అందించింది. ఇప్పటివరకు కొత్త వాహనానికి శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కొనుగోలుదారులు తప్పనిసరిగా ఆర్టీవో (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే, ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఇకపై వాహనం ఎక్కడ కొంటే అక్కడే, అంటే షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని ప్రభుత్వం శనివారం నుంచి అధికారికంగా అమలులోకి తెచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ, ప్రజలకు రవాణా సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.Telangana
ఈ నూతన విధానం అమలు కోసం రవాణా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ పనితీరును ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించారు. మాదాపూర్‌లో నిర్వహించిన ట్రయల్ రన్‌లో భాగంగా ఒక వాహనానికి షోరూమ్ వద్దే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ ప్రక్రియలో భాగంగా అధీకృత డీలర్లు వాహన ఇన్వాయిస్, బీమా పత్రాలు, యజమాని చిరునామా ధృవీకరణ, వాహన ఫోటోలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. వీటిని రవాణా శాఖ అధికారులు ఆన్‌లైన్‌లోనే పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయిస్తారు.
Also Read: Infosys: ఉద్యోగుల ఇంటి కరెంటు వివరాలు అడుగుతున్న ఇన్ఫోసిస్.. ఎందుకో తెలుసా?
ఈ విధానం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, మధ్యవర్తుల ప్రమేయం, ఆర్టీవో కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత, స్మార్ట్ కార్డ్ రూపంలో ఉండే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా యజమాని ఇంటికి చేరుతుంది. అవసరమైతే డిజిటల్ కాపీని ఆన్‌లైన్ నుండి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే, ఈ సులభతర రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రస్తుతం కేవలం బైకులు, కార్ల వంటి వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని, వాణిజ్య (ట్రాన్స్‌పోర్ట్) వాహనాలకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
