Telangana: ఈ చిత్రం రైతు బతుకు దయనీయ స్థితికి నిదర్శనం. వాగులో నీళ్లొస్తయనే ఆదెరువుతో వరిపొలాలు సాగు చేసిన రైతులకు తీరా పొట్టదశలో ఉండగా, వాగు ఎండిపోయింది. నోటికాడికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు ఆ రైతులు భగీరథ యత్నమే చేస్తున్నారు. వాగులో ఉన్న ఇసుకను తోడి గుంత తీసి నీటి ఊట నుంచి మోటరు పెట్టి తమ పొలాలకు నీరు పారించుకుంటున్నారు. అయినా ఆ ఊట సరిపోవడం లేదని రైతులు నిర్వేదంలో పడిపోయారు.
Telangana: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామ పరిధిలోని పాలేరు వాగులోనిది ఈ దృశ్యం. ఈ వాగు వెంబడి ఆ ఊరి రైతులు వరిపొలాలు సాగు చేశారు. వర్షాలు రావడంతో వరద రాసాగింది. ఆ వరదనీటితోపాటు కాళేశ్వరం నీటిని గతంలో ఈ వాగులో వదిలేవారు. దీంతో రైతులు తమ పంటలు పండించుకునేవారు. ఇప్పుడూ అలాగే నీటిని వదులుతారనే ఆశతో వరిపొలాలు సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే దశలో వాగు ఎండిపోయి, పొలాలు కూడా వాడుముఖం పట్టాయి.
మీకు దండం పెడతాం. పాలేరు వాగుకు నీళ్లు వదలండి
అప్పులు తెచ్చి పంట పెట్టుబడి పెట్టినాం.. చేతికొచ్చిన పంట ఆగమయ్యేటట్టు ఉన్నది
నీళ్లు వదలకుంటే మాకు చావే దిక్కు అయేట్టు ఉంది
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో నీళ్లు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతుల… pic.twitter.com/SSx02rQDYS
— Telugu Scribe (@TeluguScribe) March 15, 2025
Telangana: ఈ దశలో అక్కడి రైతులు ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నారు. వాగులో నీటిని వారం పాటు వదలితే తమ పొలాలు దక్కుతాయని, లేకుంటే తమకు చావే దిక్కు అని బావురుమంటున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, చేతికొచ్చిన పంట ఆగమయ్యేలా ఉన్నదని ఆవేదన చెందుతున్నారు.