Telangana: లింగవివక్షకు గురై సమాజంలో అవమానాలకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు కూడా గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు, వారు తమ కాళ్లపై నిలబడేందుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్‌జెండర్లకు 100 శాతం సబ్సిడీతో రుణాలను అందజేసేందుకు ఆదేశాలను జారీచేసింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Telangana: ట్రాన్స్‌జెండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కింద అర్హత కలిగిన ఒక్కొక్కరికీ రూ.75 వేల వరకు పూర్తిస్థాయి సబ్సిడీ రుణాల చొప్పున అందజేయనున్నది. ఈ రుణసాయాన్ని లబ్ధిదారులు మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ట్రాన్స్‌జెండర్లు ఏ రంగంలోనైనా నైపుణ్య శిక్షణ పొంది, సొంతంగా చిరువ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ రుణ సదుపాయం కల్పిస్తారు. ఈ పథకానికి 18 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వయసు వరకు అర్హులని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సాధికారత శాఖ అధికారులు వెల్లడించారు.
Telangana: ఈ మేరకు హైదరాబాద్ జిల్లాలో అర్హులైన 30 మందికి స్వయం ఉపాధి యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం కోసం ఆసక్తి, అర్హత కలిగిన వారు హైదరాబాద్ నగరంలో నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న కార్యాలయంలో సూచించిన ధ్రువపత్రాలతో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు. లేదా www.wdsc.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2026 జనవరి 31వ తేదీలోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
