Fish Canteen: హైదరాబాద్‌లో చేపల వినియోగం చాలా తక్కువగా ఉంది. దీనిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం చేపల వినియోగం పెంచడానికి నగరంలో ఫిష్ క్యాంటీన్‌లను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా మాసాబ్ ట్యాంక్‌లో మొదటగా ఒక ఫిష్ క్యాంటీన్ ప్రారంభించగా, తాజాగా నాంపల్లిలో మరో ఫిష్ క్యాంటీన్‌ను ఓపెన్ చేశారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది అంటున్నారు. వీటికి వచ్చే స్పందనను బట్టి నగరంలో ఇంకొన్ని ఫిష్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
ఈ ఫిష్ క్యాంటీన్లలో తక్కువ ధరకే రుచికరమైన ఫిష్ వెరైటీలను రుచి చూడవచ్చు అంటున్నారు. ఇదివరకే మాసాబ్ ట్యాంక్‌లో ఓపెన్ చేసిన ఫిష్ క్యాంటీన్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ రావడంతో నాంపల్లి మెట్రో పిల్లర్ 1300 సమీపంలో బుధవారం నాడు మరో ఫిష్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌తో కలిసి ఈ ఫిష్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. తర్వాత మేయర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నగర ప్రజలకు నాణ్యమైన చేపలని తక్కువ ధరలకే అందించాలని అనుకుంది. దీంతో తక్కువ ధరకే చేపలు పొందడంతో పాటు రాష్ట్రంలో చేపల విక్రయం పెరుగుతుంది, నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. ఇందులో భాగంగానే ముందుగా మాసాబ్ ట్యాంక్‌లో ఒక ఫిష్ క్యాంటీన్ తెరవడం జరిగింది. ఇప్పుడు నాంపల్లిలో రెండో ఫిష్ క్యాంటీన్‌ను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Raju Weds Rambai: రాజు వెడ్స్ రాంబాయి ఫ్రీ షో…కానీ
తర్వాత తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో చేపల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్‌ను ప్రారంభించాము అన్నారు. తెలంగాణలో చేపలు తినేవారు తక్కువ మంది ఉన్నారు. కానీ వైద్య నిపుణులు వారానికి ఒక్కసారైనా తినాలని చెబుతున్నారు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రజల సౌకర్యార్థం నగరంలోనే ఫిష్ క్యాంటీన్లు తెరుస్తున్నాము అన్నారు. ఇంకా రానున్న రోజుల్లో నగరంలో మరిన్ని ఫిష్ క్యాంటీన్లను తెరవనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగులు ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేందుకు గాను రాష్ట్ర మత్స్యశాఖ సహకారం కల్పిస్తోందని సాయి కుమార్ పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. తర్వాత ఈ ఫిష్ క్యాంటీన్‌లో రుచి చూసి బాగుందన్నారు. అలాగే ప్రభుత్వం తో మాట్లాడి మధ్యాహ్న భోజనంలో కూడా చేపలు ఉండేలా ప్రయత్నం చేస్తాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వీటితో పాటుగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
