Telangana Rising-2047:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్-2047 పాలసీ చర్చనీయాంశంగా మారింది. 2047 నాటికి సాధించే లక్ష్యాలను పేర్కొంటూ ప్రభుత్వం పాలసీ డాక్యమెంట్ను రూపొందించేందుకు సిద్ధమైంది. రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని, ఆ లక్ష్యాల సాధనకు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించేందుకు ఒక నూతన ఫార్మాలను ప్రభుత్వం ప్రతిపాదించింది.
Telangana Rising-2047:2034 సంవత్సరం నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఆయా లక్ష్యాలపై అంతటా ఆసక్తి నెలకొని ఉన్నది. రాష్ట్ర అభివృద్ధిని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), పెరీ అర్బన్ ఎకానమీ (PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ (RARE)గా ప్రభుత్వం విభజించింది.
Telangana Rising-2047:రానున్న ఈ 22 సంవత్సరాల కాలంలో యువతకు మెరుగైన ఉపాధి, అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఫార్మా, ఏరోస్పేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), టూరిజం, ఎంఎస్ఎంఈ వంటి రంగాల ఆర్థికవృద్ధికి పాటుపడాలని కీలకంగా నిర్ణయించింది. ఆయా రంగాల్లో ఉద్యోగ, ఉపాధితోపాటు ఆదాయంపై దృష్టి సారించనున్నది.
Telangana Rising-2047:పారదర్శక పాలన, సులభతర అనుమతుల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి అంశాలు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, వీటి ఆధారంగా విజన్ డాక్యమెంట్ రూపొందించాలని నిర్ణయించారు. మూసీ పునరుజ్జీవం, విలేజ్ 2.0 లక్ష్యంతో గ్రామాల డెవలప్మెంట్, రీజినల్ రింగ్ రోడ్డు, హైస్పీడ్ కారిడార్లు, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు వంటి అంశాలనూ ఈ డాక్యమెంట్లో చేర్చనున్నది.
