Telangana: తెలంగాణలో జిల్లాలు మరుతాయా? జిల్లాల భౌగోలిక స్వరూపం మారుతుందా? ఒక నియోజకవర్గం పరిధిలోని మండలాలన్నీ ఇక నుంచి ఒకే జిల్లాలో ఉండనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగి తీరుతుందని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తేల్చి చెప్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వవస్థీకరణ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ మేరకు అప్పుడే చర్యలు మొదలయ్యాయని కూడా తెలుస్తున్నది.
Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి 10 ఉమ్మడి రాష్ట్రం నాటి జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత 2016 అక్టోబర్ 11న 21 నూతన జిల్లాలు ఏర్పాటయ్యాయి. దీంతో మొత్తంగా 31 జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత 2019న నారాయణపేట, 2021న వరంగల్ జిల్లాను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం 33 జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకూ ఇదే 33 జిల్లాలతో తెలంగాణలో పరిపాలన కొనసాగుతున్నది.
Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక ఏర్పడిన తొలి ప్రభుత్వం జిల్లాల విభజనను శాస్త్రీయంగా చేయలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఇప్పుడున్న జిల్లాలతో పాలనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా చెప్పారు. గత పాలకులు ప్రజల విజ్ఞప్తులను, భౌగోళిక పరిస్థితులను పక్కనబెట్టారని, రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం అదృష్ట సంఖ్యల వారీగా మండలాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు.
Telangana: ఇప్పుడున్న జిల్లాల పరిధిలోని ఒక నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లాయని, ప్రజలు తమ పనుల కోసం వందలాది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇలాంటి తరుణంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే దశలో శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పూనుకన్నట్టు తెలుస్తున్నది.
Telangana: ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్న లోపాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదికలు రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు నివేదికలను రూపొందించే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమై ఉన్నారు. వారిచ్చే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిసింది. ఆ నివేదికల మేరకు జిల్లాల మార్పులు, చేర్పుల విషయంలో ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి, శాసనసభలో ఆమోదం పొంది పునర్వవస్థీకరణకు పూనుకుంటుంది. అంటే జిల్లాల సంఖ్య కొంచె అటూ ఇటు మారినా, భౌగోళిక స్వరూపాలు భారీగా మారుతాయని అంచనా వేస్తున్నారు. చిన్న జిల్లాల స్వరూపం కూడా మారుతుందని భావిస్తున్నారు.
