TS News: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ తరఫున పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ముందుకు పెట్టింది. దీని ద్వారా నీటి వినియోగం, సాగునీరు సదుపాయాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ 11 ముఖ్య ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్రం ఈ సమావేశంలో 11 కీలక అంశాలు ప్రతిపాదించింది. అవి ఇలా ఉన్నాయి:
-
పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు వెంటనే అనుమతులు ఇవ్వాలి.
-
శ్రీశైలం నుంచి వేరే బేసిన్‌కి నీటి తరలింపును ఆపివేయాలి.
-
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఏపీ సహకరించాలి. అలాగే కృష్ణా ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలకు మద్దతు ఇవ్వాలని కేంద్రం ఏపీని ఒప్పించాలి.
-
కృష్ణా జలాలను వేరే బేసిన్‌కి తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకోవాలి. అక్రమ నీటి తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని ఏపీ అంగీకరించాలి.
-
తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చ జరగాలి.
-
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులు అమలు చేయాలని, చట్టపరంగా ముందుకు వెళ్లాలని కేంద్రం చర్యలు తీసుకోవాలి.
-
శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలి.
-
శ్రీశైలం ప్రాజెక్ట్‌లో కొత్తగా నిర్మిస్తున్న హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టులపై నియంత్రణ ఉండాలి.
-
శ్రీశైలం డ్యాం సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాలి.
-
శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలించి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి.
-
ఇచ్చంపల్లి ప్రాజెక్టుకి పోలవరం ప్రాజెక్టు తరహాలోనే కేంద్రం నిధులు ఇవ్వాలి. ఇచ్చంపల్లి నుంచి కావేరీకి గోదావరి జలాల తరలింపునకు అనుమతులు ఇవ్వాలి. అందులో 200 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలాగే సమ్మక్క సాగర్, ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరింది.