Jeevan Reddy

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై? క్లైమాక్స్‌కు చేరిన బుజ్జగింపుల పర్వం.. జగిత్యాల నివాసంలో పీసీసీ చీఫ్ భేటీ!

Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి పార్టీ రాజీనామా ఉదంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత 20 నెలలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, చివరకు అవమానాలు భరించలేక మార్చి 25న (రేపు) కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయనను ఎలాగైనా పార్టీలోనే కొనసాగించేందుకు అధిష్టానం చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనతో కీలక చర్చలు జరుపుతున్నారు.

విఫలమైన మంత్రుల రాయబారం.. రంగంలోకి పీసీసీ చీఫ్

జీవన్‌రెడ్డి అలికను తీర్చేందుకు ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన చర్చలు సఫలం కాలేదు. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. రాజీనామాకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో, పీసీసీ చీఫ్ స్వయంగా రంగంలోకి దిగడం ఉత్కంఠను రేపుతోంది. రేపు తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు జీవన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.

“పొలిటికల్ సూపర్ స్టార్”.. రజినీకాంత్ పోస్టర్ల హల్చల్

జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసం వద్ద వెలసిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు జీవన్‌రెడ్డి, మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోటోలతో ఉన్న ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యలో “నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే” (I say it once, it’s like I’ve said it a hundred times) అనే ఫేమస్ డైలాగ్‌ను రాశారు. దీని కింద “తెలంగాణ పొలిటికల్ సూపర్ స్టార్ జీవన్‌రెడ్డి” అని పేర్కొనడం విశేషం. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు అనే సంకేతాన్ని అనుచరులు ఈ పోస్టర్ ద్వారా పంపిస్తున్నారు.

అసంతృప్తికి కారణాలేంటి?

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా రాజకీయాల్లో తన ప్రాధాన్యత తగ్గడం, ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతలను పార్టీలోకి చేర్చుకోవడం వంటి అంశాలపై జీవన్‌రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం దశాబ్దాల కాలంగా పనిచేసిన తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బుజ్జగింపులు ఫలించి ఆయన శాంతిస్తారా? లేక రజినీకాంత్ డైలాగ్ లాగే తన రాజీనామా నిర్ణయానికే కట్టుబడతారా? అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *