Sankranti 2026: సంక్రాంతి పర్వదిన సందర్భంగా రాష్ట్రంలోని హైదరాబాద్ సహా ఇతర ముఖ్య నగరాలు, పట్టణాలు, గ్రామాల నుంచి సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లేవారు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని పోలీస్ శాఖ హెచ్చరించింది. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సందర్భాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ నిరంతరం ఉంటుందని, అయినా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీస్ అధికారులు సూచనలు చేస్తున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసు శాఖ తెలిపింది. అయితే ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరింది. ఏదైనా అనుమానాస్పద సమచారం ఉంటే వెంటనే డయల్ 100కు లేదా ఆయా జిల్లాల పోలీస్ కంట్రోల్ రూంలకు, స్పెషల్ బ్రాంచి కంట్రోల్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ సూచించింది. ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను పోలీస్ శాఖ కింది విధంగా పేర్కొన్నది.
ఇది కూడా చదవండి: AI Cinema: AI కంట్రోల్ లో మనం ఉంటే ముప్పే.. ‘చిరంజీవి హనుమాన్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్
1) ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు సరిగా మూసి వేయాలి.
2) ఇంటిలో ఉన్న విలువైన ఆభరణాలు, నగదు, ఇతర ముఖ్యమైన పత్రాలను బ్యాంక్ లాకర్‌లో లేదా నమ్మదగిన వ్యక్తుల వద్ద భద్రపరచాలి.
3) ఇంటిలో ఎవరూ లేరని తెలియకుండా ఉండేందుకు టైమర్ లైట్లు, లేదా రాత్రి వేళ లైట్లు వెలిగేలా ఏర్పాటు చేసి ఉంచాలి.
4) ఇంటి ముందు పత్రికలు, పార్శిల్లు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.
5) అనుమానాస్పద వ్యక్తులు, లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.
6) సీసీటీవీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రత మరింత మెరుగుపడుతుంది.
7) సోషల్ మీడియాలో ఊరికి వెళ్లాం, ఇంటి వద్ద లేను, వంటి సమాచారాలను పంచుకోవద్దు.
8) పొరుగువారితో సమన్వయం కలిగి పరస్పరంగా ఇళ్లపై నిఘా ఉంచుకునేలా సహకరించాలి
9) ఇంటి తాళాల్ని తలుపుల వద్ద, పూలకుండీలో లేదా మ్యాట్ల కింద దాచి ఉంచరాదు.
10) పనిమనుషులు, డ్రైవర్లు, అపరిచితుల వివరాలను సరిగా పరిశీలించి మాత్రమే ఇంటిలోకి అనుమతించాలి.
11) ఇంటి చుట్టూ పొదలు, చెట్లను తొలగించి స్పష్టంగా కనిపించేలా చూడాలి.
12) ఇంటి ప్రధాన గేటు లేదా ఇంటి ముందు సెన్సార్ లైట్లు ఏర్పాటు చేయడం ద్వారా అనవసర ప్రవేశాలను అడ్డుకోవచ్చు.
13) ఇంటిలోకి వెళ్లే దారుల్లో వాహనాలు ఎక్కువ రోజులు నిలిపి ఉంచకుండా జాగ్రత్త పడాలి.
14) బంగారం కొనుగోలు లేదా పండుగ షాపింగ్ వివరాలను బహిరంగంగా చెప్పుకోవద్దు.
15) ఇంట్లో పనిచేసే వారి వివరాలను పోలీస్‌స్టేషన్‌లో వెరిఫికేషన్ చేయించుకోవాలి.
16) ప్రయాణానికి ముందు ఇంటి ఫొటోలు, విలువైన వస్తువుల వివరాలను భద్రంగా ఉంచుకోవడం మంచింది.
17) అపార్ట్‌మెంట్‌లు, కాలనీల్లో వాచ్‌మన్‌లను అప్రమత్తం చేసి గేట్లను సరిగా మూసి ఉంచేలా చూడాలి.
18) రాత్రి వేళ అనవసరంగా బయటి లైట్లు ఆఫ్ చేయకుండా ఉంచడం మంచిది.
19) అద్దె ఇళ్ల యజమానులు ఖాళీగా ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
20) ఇంటి బయట గేటుకు ఎక్కువ రోజులు తాళం పెట్టి ఉంచితే ఇంటిలో ఎవరూ లేరని దొంగలు పడే అవకాశం ఉన్నది.
