Telangana Police: దసరా, బతుకమ్మ పర్వదినాలకు ఊరెళ్లే వారు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లే వారు సమీప పోలీస్‌స్టేషన్లలో, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారికి తెలపాలని పేర్కొన్నది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ అధికారులు కోరారు. విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో గానీ, తమ వెంట గానీ ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అపరిచితులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
పోలీస్ శాఖ సూచనలు ఇవే..
1) ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హారేక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలి.
2) రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించాలి.
3) శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రి వేళ చోరీలకు పాల్పడుతుంటారు.
4) ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి
5) వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇళ్లకు చేరుకునేలా ప్రణాళికలు వేసుకోండి
6) పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది.
7) ఇంటిలో కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు.. ఎవరైనా అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మొద్దని చెప్పండి
8) విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లకూడదు. ఊరికి వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఇంటిలో ఉంచకపోవడమే మంచిది. లేదా బ్యాంకు లాకర్‌లో పెట్టండి.
9) కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి.
10) తాళం వేసి ఊరుకు వెళ్లే ముందు మీ సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించండి.
11) పోలీస్ శాఖ వారికి అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి.
12) ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల వారి ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్లు మీవద్ద ఉంచుకోవాలి.
13) మీరు బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. ప్రయాణం పూర్తయ్యాక, ఇంటికి చేరుకుని ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయండి.
14) విద్యుత్తు, గ్యాస్, ఫ్రిజ్ స్విచ్‌లను ఆఫ్ చేసి వెళ్లండి.
15) ఎప్పటికప్పుడు సమచారం ఇవ్వదలుచుకునే వారు మీ సమీప పోలీస్‌స్టేషన్లను సంప్రదించండి. లేదా డయల్ 100ను సద్వినియోగం చేసుకోండి.