Telangana: తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై వెలిసిన శ్రీ లింగమంతుల స్వామి వారి జాతర ఈ నెల 16 నుంచి ఐదు రోజులపాటు వైభవంగా జరగనున్నది. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. యాదవులు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
Telangana: పెద్దగట్టు జాతర జరిగే రోజుల్లో పెద్దగట్టు పరిసరాలు జనంతో కిక్కిరిసిపోతాయి. ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామగ్రామాల నుంచి డోలు చప్పుళ్లు, విచిత్ర వేషధారణలతో కూడిన ప్రదర్శనలు చేసుకుంటూ స్వామివారి వద్దకు భక్తులు తరలివస్తారు. ప్రభ బండ్లు, ట్రాక్టర్లు, ఇతర పలు రకాల వాహనాల్లో పెద్దగట్టుకు తరలివస్తారు.
Telangana: ఈ మేరకు జాతర వద్ద పెద్ద ఎత్తున పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి 65పై వాహనాలను మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కోదాడ వద్ద మళ్లించనున్నారు.
Telangana: పెద్దగట్టు జాతర కోసం 2000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో 68 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా చేపట్టనున్నారు. మహిళల రక్షణకు షీటీమ్ సిబ్బంది బృందాలను ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో జూదం, బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా తగు చర్యలు తీసుకోనున్నారు. దొంగతనాలు జరగకుండా పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు పోలీస్ శాఖ తెలిపింది.

