TG News: తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, జల సంరక్షణకు, వ్యవసాయ అభివృద్ధికిగాను ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పనతోపాటు ప్రగతి సాధన పనులు చేపట్టడమే ఈ జాతర లక్ష్యం. మొత్తం రూ.2, 198 కోట్లతో లక్షకు పైగా పనులకు సర్కారు ఇటీవలే శ్రీకారం చుట్టింది.
పనుల జాతర తో పాటుగా ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా వంటి కీలక విభాగాల ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పనులను కూడా ప్రారంభించనున్నారు. కాగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖల ఆద్వర్యంలో గత ఏడాది నిర్వహించిన పనులను కూడా పనుల జాతరలో చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవాలు చేశారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పనుల జాతర కింద చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేశారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరూ పనుల జాతరలో పాలుపంచుకోవాలని, ప్రజా ప్రతినిధులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపాధి కల్పన, గ్రామీణ అభివృద్ధిలో ఈ పనుల జాతర కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా ఉత్తరాలు రాశామని తెలిపారు.
స్థానిక ఎన్నికల కోసమేనా?
రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలు ప్రకటించి.. వాటిని పట్టాలెక్కించకుండా పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా పనుల జాతర అంటూ కొత్త కార్యక్రమం చేపట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో చాలా పథకాలు ఇప్పటకీ అమలుకు నోచుకోలేదు. మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్థామన్న భృతి ఊసే లేదు. చేయూత పింఛన్ ను రూ.4000 చేస్తామన్న హామీకీ అతీ గతీ లేదు.
కల్యాణలక్ష్మికి రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పడం వరకే పరిమితమయ్యారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణతోనే ముగిసింది. మరోవైపు కొన్నాళ్లపాటు అమలు చేసిన రూ.500కే గ్యాస్ సిలిండర్ మధ్యలోనే ఆగిపోయింది. సబ్సిడీ సొమ్ము ఏ లబ్దిదారుడి ఖాతాలోనూ పడటంలేదు. ఇందిరమ్మ ఇళ్లు ఎవరెవరికి ఇచ్చారో, ఎక్కడ కడుతున్నారో కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఇన్ని తప్పులు, వైఫల్యాలు కళ్లముందు కనిపిస్తున్నా.. మళ్లీ పనుల జాతర అంటూ కొత్త పల్లవి అందుకున్నదనే విమర్శలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Kavitha: నేను ఏ పార్టీలో చేరడం లేదు.. భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తా
బీఆర్ ఎస్ పై విమర్శలతోనే సరి!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా.. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఎవరు చూసినా ప్రతి కార్యక్రమంలోనూ తమ ప్రభుత్వం చేసినపనులు చెప్పాల్సిందిపోయి.. ప్రతిపక్ష బీఆర్ ఎస్‌పై ఆరోపణలకే ప్రాధాన్యమిస్తున్నారు. అది ఒక్కోసారి శ్రుతి మించుతున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పెద్దలు ఈ వైఖరిని వ్యూహాత్మకంగానే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరాన్ని బీఆర్ ఎస్ కు కల్పంచడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలపై ఆ పార్టీ మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు.
ఒకవేళ మాట్లాడినా ప్రచారం మాత్రం అధికార పార్టీ నేతలు చేసిన ఆరోపణలకు బీఆర్ ఎస్ నేతలు స్పందించిన తీరు మాత్రమే ప్రచారంలోకి వస్తోంది. తద్వారా కాంగ్రెస్ లక్ష్యం నెరవెరుతోంది. తాజాగా రూ.2వేల కోట్లకు పైగా నిధులతో పనుల జాతర అంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇందులో ప్రజల దాకా చేరి సద్వినియోగమయ్యే నిధులు ఉంటాయా? అన్నదే ప్రశ్నార్థకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.