Municipal Elections

Municipal Elections: నెలరోజుల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ?

Municipal Elections: తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల సందడి మొదలైంది. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటరు జాబితా రూపకల్పనపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా పకడ్బందీగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని, ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, వచ్చే నెల 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఓటర్లు తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.

ఇది కూడా చదవండి: Trivikram: నువ్వు నాకు నచ్చావ్.. ఫ్లాప్ అన్న మాట విని బండి వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయా!

దీనిని ప్రాతిపదికగా తీసుకుని, 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ కమిషనరేట్ ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తుండటంతో, త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

మరోవైపు రాజకీయంగా కూడా ఈ ఎన్నికల వేడి పెరిగింది. జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడే ఎన్నికల క్షేత్రంలోకి దూకాలని ఆయన పిలుపునిచ్చారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని, అప్పటివరకు స్థానిక కార్యకర్తలు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని సూచించారు. అటు ఎన్నికల సంఘం యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీల సన్నద్ధత చూస్తుంటే రాష్ట్రంలో ‘పురపోరు’కు సమయం ఆసన్నమైందని స్పష్టంగా అర్థమవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *