Ponnam Prabhakar: కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుండి బస్సు బయలుదేరిన నేపథ్యంలో, ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేసిన మంత్రి, ముఖ్యమంత్రి కూడా వివరాలు తెలుసుకున్నారని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని రవాణా శాఖను ఆదేశించారని పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ వంటి నిబంధనల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించబోమన్నారు. యజమానుల నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం జరిగితే, వారిపై హత్య నేరం కింద కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడకుండా స్పీడ్ లిమిట్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.
Also Read: KCR: జూబ్లీహిల్స్ ఎన్నికపై బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కేసీఆర్ కీలక ఆదేశాలు
ప్రమాదాల నివారణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ మూడు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, కమిషనర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో బస్సుల్లో భద్రతా చర్యలు, ఓవర్ స్పీడ్‌ను నియంత్రించడానికి కమిటీ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు.
ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిందని మంత్రి తెలిపారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులుగా ఆరోపించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సరైన వివరాలు లభించడం లేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పర్మిట్ లేని, కాలం చెల్లిన బస్సులను తక్షణమే సీజ్ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. పూర్తి వివరాలు అందిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

