Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు నేత రంగబోయిన భాగ్య అలియాస్ రూపి (46) మరణించారు. చోటే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచ్‌పల్లి అడవుల్లో సోమవారం భద్రతా దళాలు జరిపిన గాలింపు చర్యల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మృతి చెందిన రూపిపై ప్రభుత్వం గతంలోనే రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది.
ఆయుధాల స్వాధీనం – కొనసాగుతున్న కూంబింగ్
పోలీసుల సమాచారం ప్రకారం, మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో బిఎస్ఎఫ్ మరియు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
-
ఘటనా స్థలం: కాల్పుల అనంతరం గాలింపు చేపట్టగా, రూపి మృతదేహంతో పాటు ఒక ఇన్సాస్ రైఫిల్, పేలుడు పదార్థాలు మరియు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
ముమ్మర గాలింపు: అడవిలో ఇంకా 10 మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్లు అనుమానిస్తున్న కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాఖేచా, అదనపు బలగాలతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్లు వెల్లడించారు.
సిద్ధిపేట టూ అబూజ్మడ్: రూపి ప్రస్థానం
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భాగ్య, 2004లో మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు.
తొలుత ఉత్తర తెలంగాణలో పనిచేసిన ఆమె, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఏరియా కమాండర్‌గా ఎదిగి, నక్సల్ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించారు.
ఇటీవల తెలంగాణ డీజీపీ విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల జాబితాలో రూపి పేరు కూడా ఉంది. ఆమెను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కడచూపునకు నోచుకోని తల్లి ‘ఎల్లవ్వ’
రూపి మరణవార్త ఆమె స్వగ్రామం ధర్మారంలో విషాదాన్ని నింపింది. గత కొన్నేళ్లుగా తన బిడ్డ కోసం ఎదురుచూస్తున్న తల్లి ఎల్లవ్వ ఆవేదన వర్ణనాతీతం.
నీ తండ్రి చనిపోయినప్పుడు కూడా రాలేదు బిడ్డా.. నేను చనిపోకముందే నిన్ను ఒక్కసారి చూడాలనుంది, పోలీసులకు లొంగిపోయి వచ్చేయ్” అంటూ కొద్దిరోజుల క్రితమే ఎల్లవ్వ మీడియా ద్వారా కన్నీటి విన్నపం చేసుకుంది.
కానీ, తల్లి కోరిక తీరకముందే భాగ్య ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇల్లు వదిలి వెళ్లిన కూతురు, ఇలా శవమై తిరిగి వస్తుందని ఆ తల్లి ఊహించలేకపోయింది.
