Telangana Local Body Elections: తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి సంబంధించిన అర్హతలు, నిబంధనలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి కనీసం 21 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే పోటీకి అర్హులు. అభ్యర్థులు పోటీ చేసే గ్రామం లేదా ప్రాదేశిక నియోజకవర్గంలో తప్పనిసరిగా ఓటు ఉండాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు సభ్యుల పదవుల కోసం పోటీ చేయాలనుకునే వారందరికీ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
పోటీకి అనర్హులు
-
ఉద్యోగులు : గ్రామ సేవకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలలోని ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు, స్థానిక సంస్థల్లోనే పనిచేసే వారు.
-
చట్టపరమైన పరిమితులు : శాసనసభ, పార్లమెంటు చట్టం కింద ఏర్పాటయ్యే సంస్థ ప్రతినిధులు, మతిస్థిమితం లేనివారు, పూర్తిస్థాయి బధిరులు, మత సంబంధిత సంస్థల ఛైర్మన్లు, సభ్యులు.
-
కాంట్రాక్టర్లు : పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో లేదా ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు/నిర్వహణ ఒప్పందం చేసుకున్న వారు.
-
నేరస్తులు : క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్షపడినవారు – శిక్ష విధించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాలు పోటీ చేయలేరు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 కింద శిక్షపడిన వారు కూడా అనర్హులు.
ఇది కూడా చదవండి: Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ- రష్మిక సీక్రెట్ ఎంగేజ్మెంట్
పోటీకి అర్హులు
-
సింగరేణి, ఆర్టీసీ వంటి సంస్థల్లో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్, సెక్రటరీ హోదా తప్పించి ఇతర ఉద్యోగులు పోటీ చేయవచ్చు.
-
రేషన్ డీలర్లు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కలిగి ఉంటారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కోసం మార్గదర్శకాలు
-
ప్రణాళిక (మ్యానిఫెస్టో) : పార్టీలు, అభ్యర్థులు రూపొందించే ప్రణాళికలో హేతుబద్ధమైన, అమలు చేయగల హామీలను మాత్రమే పొందుపరచాలి. ఆ హామీలను నెరవేర్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో స్పష్టంగా పేర్కొనాలి.
-
రాజ్యాంగంలో పేర్కొన్న విధాన నిర్దేశక సూత్రాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలపై హామీలు ఇవ్వవచ్చు.
-
ఓటర్లపై ప్రభావం చూపే, ఆచరణలో సాధ్యం కాని వాగ్దానాలు చేయకూడదు.
-
పోలింగ్‌కు రెండు రోజుల ముందు కొత్త ప్రణాళికలు విడుదల చేయరాదు.
ఇది కూడా చదవండి: Suicide: పెళ్లి చేసుకున్న ఆరురోజులకే భర్తతో గొడవ.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
పోలింగ్ ఏజెంట్ల నియామకంపై నిబంధనలు
ఓటర్లపై అనుచిత ప్రభావాన్ని నివారించేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక చైర్‌పర్సన్లు, ప్రజాపరిషత్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వంటి అధికార, రాజకీయ హోదా ఉన్నవారిని పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించరాదు.