Telangana Liquor Policy: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ మరో శుభవార్తను అందించింది. అక్టోబర్ 18వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియడంతో, సరైన పత్రాలు లేక ఎవరైనా దరఖాస్తు చేసుకోలేకపోయి ఉంటే, వారికి మరో అవకాశాన్ని ఇచ్చింది. ఈ మేరకు దరఖాస్తు గడువును మరో 5 రోజుల వరకూ పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
Telangana Liquor Policy: చివరిరోజైన శనివారం (అక్టోబర్ 18న) దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది ఎదురు చూశారు. అయితే డీడీలు చెల్లించేందుకు బ్యాంకులకు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఆరోజు బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ జరిగింది. దీంతో వారంతా నిరాశకు లోనై వెనుదిరిగి వెళ్లిపోయారు. బ్యాంకుల సెలవులు ఉండటంతో డీడీలు చెల్లింపులో ఇబ్బందులు ఎదురైన విషయంపై ఎక్సైజ్ కార్యాలయాల్లో వ్యాపారులు వినతులను సమర్పించారు.
Telangana Liquor Policy: ఈ మేరకు పలువురి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దరఖాస్తుల ఆఖరి గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగిస్తూ మరో అవకాశం కల్పించింది. ఈ కారణంగా అక్టోబర్ 23న జరగాల్సిన మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఇదేనెల 27వ తేదకి వాయిదా వేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిషన్ ప్రకటించారు.
Telangana Liquor Policy: ఇదిలా ఉండగా 2025-27 మద్యం దుకాణాల కోసం గత సెప్టెంబర్ 26న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీ వరకు 50 వేల దరఖాస్తులు అందగా, తుది గడువు అయిన శనివారం (అక్టోబర్ 18) రాత్రి 11 గంటల వరకు మరో 37వేల దరఖాస్తులు అందినట్టు సమాచారం. దీంతో మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 87,000 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. గతేడాది ఊహించనంతగా 1.37 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.