Telangana Inter Results: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22 (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పరీక్షల విశేషాలు:
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 5 నుంచి మార్చి 25 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకూ ప్రాక్టికల్ పరీక్షలు జరగ్గా, మొత్తం 1532 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. అందులో 4.88 లక్షల మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు కాగా, మిగతా వారు ద్వితీయ సంవత్సరం విద్యార్థులే.
ఫలితాల కోసం ఎక్కడ చూడాలి?
విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లో చూసుకోవచ్చు. హాల్‌టికెట్ నంబర్ మరియు పుట్టిన తేది వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వతే..
ఇంటర్ పరీక్షల ముగింపుతోనే, మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకూ మూల్యాంకన కార్యక్రమాన్ని బోర్డు వేగంగా పూర్తి చేసింది. దీంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.