Hyderabad

Hyderabad: హైదరాబాద్‌ హోటల్స్ క్లోజ్?.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హోటల్స్ అసోసియేషన్

Hyderabad: అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడు సామాన్యుడి వంటగదిపై, ముఖ్యంగా హోటల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ కొరత మొదలైంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో హోటల్స్ మూతపడగా, విశాఖపట్నంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హోటల్స్ బంద్ అవుతాయా అనే అంశంపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది.

తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, ఇప్పుడు అసలు గ్యాస్ దొరకడమే కష్టంగా మారిందని ఆయన తెలిపారు. గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, డిస్ట్రిబ్యూటర్లు కూడా గ్యాస్ ఇవ్వడం కష్టమని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

మనిషికి ఊపిరి ఎంత ముఖ్యమో, హోటల్ నిర్వహణకు గ్యాస్ అంత ముఖ్యమని వెంకట్ రెడ్డి అన్నారు. గ్యాస్ సరఫరా లేకపోతే ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతానికి హైదరాబాద్‌లో హోటల్స్ బంద్ చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ కొరత తీర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *