TG High Court: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకల కేసులో మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్), మాజీ మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇద్దరు నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆ తేదీకి వాయిదా వేసింది.
కమిషన్ రిపోర్ట్‌పై ఆధారపడి చర్యలు వద్దు
జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ఇటీవల సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీబీఐ విచారణకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని ఇద్దరు నేతలు కోర్టును కోరారు.
ఇది కూడా చదవండి: Danam Nagender: కాళేశ్వరం ప్రాజెక్టుపై లోతైన విచారణ జరగాలి: ఎమ్మెల్యే దానం నాగేందర్
ప్రభుత్వ వాదన
విచారణలో అటార్నీ జనరల్ సుందరసన్ రెడ్డి మాట్లాడుతూ, కేవలం కమిషన్ నివేదిక ఆధారంగా కేసును సీబీఐకి ఇవ్వలేదని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరియు ఇరిగేషన్ శాఖ నివేదికలు సహా పలు పత్రాలను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇంకా ఎలాంటి దర్యాప్తు చర్యలు ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు.
హైకోర్టు ఆదేశాలు
విచారణ అనంతరం హైకోర్టు, తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 7 వరకు కేసుకు సంబంధించిన ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. వెకేషన్ తర్వాత ఈ పిటిషన్లపై పూర్తి స్థాయి విచారణ జరగనున్నట్లు తెలిపింది.