High Court

High Court: వాహనదారులకు ఊరట.. చలాన్ల కోసం వేధించొద్దు

High Court: ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల విషయంలో వాహనదారులకు తెలంగాణ హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. రోడ్లపై వాహనాలను ఆపి, పెండింగ్ చలాన్లు కట్టాలంటూ వాహనదారులను బలవంతం చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా చలాన్లు ఉన్నాయన్న కారణంతో బైక్ తాళాలు లాక్కోవడం లేదా వాహనాలను సీజ్ చేయడం వంటి పనులు చేయకూడదని స్పష్టం చేసింది.

సాధారణంగా ట్రాఫిక్ తనిఖీల సమయంలో పాత చలాన్లు ఉంటే పోలీసులు వెంటనే కట్టించుకోవడం మనం చూస్తుంటాం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయ్ గోపాల్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను విన్న హైకోర్టు, పోలీసుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది.

కోర్టు ఆదేశాల ప్రకారం.. పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు వాహనదారులు తమకు తాముగా చలాన్ కడతామంటే పోలీసులు ఆ డబ్బును తీసుకోవచ్చు. కానీ, వారు కట్టనని చెబితే మాత్రం బలవంతం చేయడానికి వీల్లేదు. అటువంటి సందర్భాల్లో చట్టపరమైన నిబంధనల ప్రకారం వారికి కోర్టు నోటీసులు పంపాలని న్యాయస్థానం సూచించింది.

ఈ తీర్పుతో రోడ్లపై పోలీసుల వేధింపులకు అడ్డుకట్ట పడుతుందని వాహనదారులు భావిస్తున్నారు. పోలీసులు కేవలం నిబంధనలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవాలని, పాత చలాన్ల పేరుతో వాహనాలను ఆపి ఇబ్బంది పెట్టకూడదని ఈ తీర్పు సారాంశం. చట్టాన్ని అమలు చేసే క్రమంలో పౌరుల హక్కులకు భంగం కలగకూడదని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *