TG High Court: హైదరాబాద్ సున్నం చెరువు కూల్చివేతలు, ఫెన్సింగ్ వ్యవహారంలో హైకోర్టు మరోసారి హైడ్రా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తున్నారంటూ హైడ్రా అధికారులపై మండిపడింది. కూల్చివేతల విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని, ఇది ప్రజల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని న్యాయస్థానం ఘాటుగా విమర్శించింది.
ముఖ్యంగా, చెరువు చుట్టూ ఉన్న ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) ను సరిగా నిర్ధారించకుండానే కూల్చివేతలు ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. FTL ను నిర్ణయించకుండా హద్దులు ఎలా నిర్ణయిస్తారు, ఆ హద్దుల ప్రకారం సర్వే చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదంటూ హైడ్రా అధికారులను కోర్టు నిలదీసింది. అంతేకాక, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఇచ్చిన నివేదికను కూడా అధికారులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ఫెన్సింగ్ ఎందుకు వేశారని కూడా ప్రశ్నించింది.
సున్నం చెరువు పక్కనే ఉన్న సియేట్ కాలనీ వాసుల విషయంలో హైడ్రా తీసుకుంటున్న చర్యలు వారి ఆస్తి హక్కులకు భంగం కలిగిస్తున్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-ఏ ప్రకారం వారి హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే సియేట్ కాలనీ వాసుల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడం, కూల్చివేతలు లాంటి చర్యలు చేపట్టవద్దని హైడ్రాను గట్టిగా హెచ్చరించింది. న్యాయస్థానం ఆదేశాలను గౌరవించాలని, ప్రజల హక్కులను కాపాడాలని హైకోర్టు హైడ్రాకు స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను వాయిదా వేసింది.
