Harish Rao: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత రాజకీయ దుమారం రేగింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఒక “చెంపపెట్టు” అని ఆయన వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం
హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీలో జరిగిన అక్రమాలను ఎత్తిచూపుతూ, హైకోర్టు తీర్పు తమ ఆరోపణలను నిజం చేసిందని ఆయన అన్నారు.
సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, సిగ్గుతో తలవంచుకోండి. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పండి” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టు ఆదేశాలు
హైకోర్టు తన తీర్పులో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ కోసం 8 నెలల గడువు ఇచ్చింది. ఒకవేళ అది సాధ్యం కానప్పుడు పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (TSPSC) స్పష్టం చేసింది. ఈ తీర్పుతో వేలాది మంది నిరుద్యోగుల ఆశలు, భవిష్యత్తుపై మరోసారి అనిశ్చితి నెలకొంది.