IDPL Lands: ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఐడీపీఎల్ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూకట్‌పల్లి పరిధిలో ఉన్న విలువైన భూములపై విజిలెన్స్ ద్వారా సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. పరిశ్రమల అవసరాల కోసం కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాలుగా మార్చి, మౌలిక సదుపాయాలు కల్పించారన్న ఆరోపణలు ఈ విచారణకు కారణమయ్యాయి. సుమారు రూ.4 వేల కోట్ల విలువైన ఈ భూములపై జరిగిన లావాదేవీలన్నింటినీ లోతుగా పరిశీలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్య చోటుచేసుకున్న పరస్పర ఆరోపణలే. సర్వే నెంబర్ 376 పరిధిలో భూకబ్జాలు జరిగాయని కవిత ఆరోపించగా, దీంతో, ఎమ్మెల్యే మాధవరం కూడా కవిత భర్త అనిల్‌పై భూకబ్జాలకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. ఈ మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారడంతో ప్రభుత్వం స్పందించింది.
Also Read: Kishan Reddy: ప్రధానితో మీటింగ్ లీక్‌పై కిషన్ రెడ్డి సీరియస్..!
ప్రాథమికంగా జరిగిన పరిశీలనలో, హైదరాబాద్‌లోని ఐడీపీఎల్‌కు చెందిన పరిశ్రమల భూములను అక్రమంగా క్రమబద్ధీకరించినట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గుర్తించారు. ఇండస్ట్రియల్ జోన్‌గా ఉన్నప్పటికీ, అక్కడ నివాస ప్రాంతాలుగా మారుస్తూ అనుమతులు ఇచ్చినట్లు తేలింది. జీహెచ్ఎంసీ, విద్యుత్తు శాఖ, వాటర్ వర్క్స్ వంటి విభాగాల నిబంధనలను పక్కనపెట్టి పర్మిషన్లు మంజూరు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ మొత్తం వ్యవహారంపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు. భూముల వినియోగంలో జరిగిన మార్పులు, అధికారుల పాత్ర, రాజకీయ నేతలపై వచ్చిన ఆరోపణలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణలో ఎవరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది తేలితే, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఐడీపీఎల్ భూముల వ్యవహారం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

