GHMC: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పాలనా వ్యవహారాలలో చారిత్రక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇటీవల 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన నేపథ్యంలో, పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, జీహెచ్‌ఎంసీలో ఎన్నికయ్యే కార్పొరేటర్ల సంఖ్య కూడా 300గా ఖరారు చేయబడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955లోని నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఈ జీవోను విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సమర్పించిన నివేదికను, 27 పట్టణ స్థానిక సంస్థల విలీన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Hydraa: మియాపూర్‌లో హైడ్రా మెరుపు దాడి! రూ. 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి రికవరీ
గత డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలోకి 27 అర్బన్ లోకల్ బాడీలను విలీనం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాలలో మెరుగైన పరిపాలన, సమర్థవంతమైన ప్రణాళిక, పౌర సేవలను వేగంగా ప్రజలకు అందించే లక్ష్యంతోనే ఈ భారీ విస్తరణ చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వార్డుల సంఖ్య 300కు పెరగడం వల్ల ఒక్కో వార్డు పరిధి తగ్గి, కార్పొరేటర్లు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈ విలీనం కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధి, జనాభా భారీగా పెరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటిగా మారనుంది. ప్రస్తుతం 300 వార్డులకు సంబంధించిన సరిహద్దుల పునర్విభజన ఓటర్ల జాబితా సవరణ వంటి సాంకేతిక ప్రక్రియలు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈ కొత్త 300 వార్డుల ఆధారంగానే జరగనున్నాయి.

