Indiramma Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా సాగుతున్నాయి. సొంత ఇల్లు నిర్మించుకుంటున్న నిరుపేదలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులను విడుదల చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కేవలం రెండు రోజుల్లోనే సుమారు 23 వేల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.262.51 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసింది.
ఈ నిధుల పంపిణీ ప్రక్రియను ఆధార్ అనుసంధానం ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. నిర్మాణ పనుల పురోగతిని బట్టి ఈ బిల్లులను మంజూరు చేస్తున్నారు. ఇందులో బేస్‌మెంట్ స్థాయి పనులు పూర్తి చేసిన వారు 2,763 మంది ఉండగా, గోడలు మరియు స్లాబ్ దశకు చేరుకున్న వారు 20,186 మంది ఉన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.4,351 కోట్లకు పైగా నిధులను లబ్ధిదారులకు అందజేయడం విశేషం.
ఇది కూడా చదవండి: Google: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పంచెనున్న గూగుల్..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2.50 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 1.25 లక్షల ఇళ్ల గోడలు, స్లాబ్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి కనీసం ఒక లక్ష ఇళ్లను పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. నిబంధనల ప్రకారం 400 నుండి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్న వారికి ఎటువంటి జాప్యం లేకుండా ప్రతి సోమవారం బిల్లులు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, కేవలం అర్హులైన వారికే ఈ లబ్ధి చేకూరేలా ఆన్‌లైన్ ద్వారా నిశితంగా పరిశీలిస్తున్నారు. మార్చి నాటికి మొదటి విడత లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ సహకారంతో పేదల సొంతింటి కల త్వరలోనే సాకారం కాబోతోంది.
