Telangana: పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ అద్భుతమైన శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏకంగా రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యోగులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బ్యాంకర్లతో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ బీమా ప్రక్రియ అమలులోకి వస్తుందని వెల్లడించారు.
గతంలో కేవలం సింగరేణి మరియు విద్యుత్ సంస్థల్లో మాత్రమే కోటి రూపాయల బీమా అమలులో ఉండేది. ఆయా సంస్థల్లోని సుమారు 1.10 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ఇప్పటికే ఈ ప్రయోజనం అందుతోంది. ఇప్పుడు అదే స్ఫూర్తితో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు దీనిని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల దాదాపు 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు భారీ లబ్ధి చేకూరనుంది. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఈ కోటి రూపాయల బీమా కొండంత అండగా నిలుస్తుంది.
రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని భట్టి విక్రమార్క వివరించారు. గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులే ప్రభుత్వానికి బలమని, వారి కష్టసుఖాల్లో తోడుగా ఉండటం తమ బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. పండుగ పూట ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
