హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణికి భారీగా బోనస్ ప్రకటించింది సర్కార్. సింగరేణి చరిత్రలో తొలిసారి కార్మికులకు పెద్ద మొత్తంలో ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
గతేడాది కంటే రూ.20వేలు అదనంగా బోనస్ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఎప్పుడూ పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రమే బోనస్ ఇచ్చేవారని..కానీ, ఈసారి సింగరేణి చరిత్రలో మొదటిసారిగా మానవతా దృక్పథంతో కాంట్రాక్టు్ కార్మికులకు కూడా బోనస్ ఇస్తున్నామని తెలిపారు. దసరా పండగ కంటే ముందే బోనస్ ఇవ్వాలనిప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్ లో లాభాలతోపాటు సింగరేణి సంస్థ తర్వాత తరానికి ఉపయోగపడే విధంగా రామగుండంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం తెలిపారు.