Telangana Governor: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ త్వరలో సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పరిధిలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. కోదాడలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్మించనున్న నవోదయ పాఠశాల నూతన భవన నిర్మాణానికి గవర్నర్ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా హుజూర్ నగర్ మండలం మగ్దుంనగర్‌లో నిర్మించనున్న వ్యవసాయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
Telangana Governor: కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల స్థలంలోని 19.12 ఎకరాలలో ఈ నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. భవన సముదాయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొత్తగా ఇటీవల 7 నవోదయ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కోదాడతోపాటు కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, జగిత్యాల జిల్లాలకు నూతన పాఠశాలలు మంజూరయ్యాయి.
Telangana Governor: హుజూర్‌నగర్ మండలం మగ్దుంనగర్ పరిధిలో నిర్మించనున్న అగ్రికల్చర్ కళాశాలకు రూ.126 కోట్లు కేటాయించనున్నారు. సుమారు 100 ఎకరాల పరిధిలో ఈ కళాశాలను నిర్మించనున్నారు. ఈ కళాశాల భవన శంకుస్థాపన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమీపంలోని కృష్ణా నది ఒడ్డున కొలువై ఉన్న మట్టపల్లి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకోనున్నారు. ఈ మేరకు గవర్నర్ జనవరి 20వ తేదీన వచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
Telangana Governor: ఈ మేరకు కోదాడ కేఆర్ఆర్ కళాశాల, హుజూర్‌నగర్ మగ్దుంనగర్ ప్రాంతాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పర్యటించి గవర్నర్ పర్యటన ఏర్పాట్లును పరిశీలించారు. మట్టపల్లిలో కూడా గవర్నర్ పుణ్యక్షేత్ర సందర్శన సందర్భంగా చేపట్టే ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. నిర్మాణ స్థలాలను, రవాణా, సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
