Chevela Bus Accident: తాండూరు, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఇటీవల జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మొత్తాన్ని గురువారం (నవంబర్ 6, 2025) అందజేసింది. స్థానిక తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఈ పరిహారం చెక్కులను బాధితుల కుటుంబాలకు అందించారు. చేవెళ్ల ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఎక్స్ గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వయంగా అందించారు.
Also Read: Netflix: హైదరాబాద్ కి నెట్‌ఫ్లిక్స్ స్టూడియో.. ఇక్కడి నుండే VFX వర్క్స్,పోస్ట్ ప్రొడక్షన్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. “ఈ ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఈ పరిహారం అందిస్తున్నాం,” అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, వారికి అయ్యే చికిత్స ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి పరిహారం అందించడం పట్ల బాధిత కుటుంబాలు కొంత ఊరట పొందాయి.

