Telangana: బతుకమ్మ పండుగ వేళ.. దసరా పర్వదినం సమీపిస్తున్న సమయంలో తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఎన్నాళ్ల నుంచో యూరియా దొరకక అవస్థలు పడుతున్న రైతులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్తను అందించింది. సెప్టెంబర్ నెలలో తెలంగాణకు పంపిన యూరియాకు అదనంగా కేటాయించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
Telangana: ఈ మేరకు సెప్టెంబర్ నెల యూరియా కంటే అదనంగా దాదాపు 60,000 మెట్రిక్ టన్నులను పంపగా, రవాణాలో ఉన్నదని కేంద్రం తెలిపింది. దానికి మరో 50,000 మెట్రిక్ టన్నులను వచ్చే వారం నాటికి రాష్ట్రానికి పంపుతామని కేంద్రం వెల్లడించింది. దీంతో ఇప్పటికే అదును దాటిపోయి రైతులు చాలావరకు నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉన్నా, ఎంతో కొంత మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. అయినా ఇప్పటికీ యూరియా డిమాండ్ ఉన్నది. దీంతో రైతులు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
Telangana: ఇప్పటి వరకు తెలంగాణకు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఏపీలోని వివిధ ఓడరేవుల నుంచి ఈ ఎరువులు దిగుమతి అవుతున్నాయి. కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, మంగళూరు, జైగఢ్, కృష్ణపట్నంతో సహా ప్రధాన ఓడరేవుల ద్వారా తాజా సరఫరాలు జరుగుతున్నాయి.
Telangana: కాకినాడ ఓడరేవు నుంచి 15,900 మెట్రిక్ టన్నుల యూరియా, విశాఖపట్నం నుంచి 37,650 మెట్రిక్ టన్నులు, గంగవరం నుంచి 27,000 మెట్రిక్ టన్నులు, మంగళూరు నుంచి 8,100 మెట్రిక్ టన్నులు, జైగఢ్ నుంచి 16,200 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం ఓడరేవు నుంచి 13,000 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా కేటాయింపులు ఉన్నాయి. దీంతో తెలంగాణలో ఇకనైనా యూరియా కష్టాలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు.