Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ విద్యా వ్యవస్థను నిర్మించేందుకు సమగ్రంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యా కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న లోపాలను పరిష్కరించేలా, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించేలా ఆచరణయోగ్యమైన విధానపత్రాన్ని రూపొందించాలని సూచించారు.
ప్రాథమిక విద్య బలోపేతమే భవిష్యత్తుకి బలమైన పునాది
ఐసీసీసీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రాథమిక దశలో బలమైన విద్య అందితేనే ఉన్నత విద్యలో విద్యార్థులు మెరుగైన ప్రతిభను కనబరిచే అవకాశముందని అన్నారు. అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాలల స్థాయిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ మార్పుల రూపకల్పనకు సమాజంలోని వివిధ వర్గాల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు.
పలు కీలక అంశాలపై సమీక్ష
విద్య రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ, ఉపాధ్యాయుల నియామకం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారమ్‌ల పంపిణీ, ‘అమ్మ ఆదర్శ కమిటీలు’, ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’, ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU)’ వంటి పథకాలను సీఎం వివరించారు. విద్యా వ్యవస్థలో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Annamalai: అధ్యక్ష రేసులో నేను లేను..
విదేశీ అనుభవాలపై అధ్యయనం
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ, పలు రాష్ట్రాలు మరియు విదేశాల్లో అనుసరిస్తున్న ప్రాథమిక విద్యా విధానాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, గతంలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు విద్యార్థుల సృజనాత్మకతను ఎలా దెబ్బతీశాయో వివరించడంతో పాటు, పరీక్షా విధానం, పాఠశాల తనిఖీలు, జీవన నైపుణ్యాల పెంపు వంటి అంశాలపై పలు సూచనలు చేశారు.
అధికారుల సమగ్ర హాజరు
ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారులు వేము నరేందర్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ప్రాథమిక విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, కె. జ్యోత్స్న శివారెడ్డి, పలు ఎన్‌జీవోలు పాల్గొన్నారు.