Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో వడివడిగా అడుగులు ఎటువైపు పడుతున్నాయి? అసలు ఏం జరుగుతోంది?
మార్పులు ఏమైనా ఉంటాయా? అంటే జరగవచ్చేమోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నాళ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ మహేశ్‌కుమార్ గౌడ్ మరోసారి సీఎం ఎవరు అనే విషయంలో చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యం సంతరించుకున్నది. కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా వ్యాఖ్యలు రావడంపై అంతర్గత చర్చకు తెరలేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
Telangana Congress: కాంగ్రెస్ పార్టీ పదేండ్లు అధికారంలో ఉంటుందని, తానే సీఎంగా ఉంటానని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అది సాధ్యం కాదని, గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలతో అధిష్ఠానం నిర్ణయం ఉంటుందని, రేవంత్‌రెడ్డి ఎలా ముందస్తుగా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు.
Telangana Congress: సీఎం రేవంత్ రెడ్డి తాజాగా జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కూడా సీఎం పదవి కొనసాగింపుపై అదే సంచలన వ్యాఖ్యలను రిపీట్ చేశారు. మరోసారి తాను సీఎం కావాలని కోరిక ఉన్నదని తన మనసులోని మాటను బయట పెట్టుకున్నారు. ఈ సారి ఎవరూ అంతగా స్పందించకపోగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాత్రం సీఎం రేవంత్ వ్యాఖ్యలకు సమర్థనగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్‌రెడ్డే మళ్లీ సీఎం అవుతారని ఆయన చెప్పుకొచ్చారు.
Telangana Congress: ఈ దశలో సెప్టెంబర్ 8న టీపీసీసీ విస్తృత సమావేశం జరుగుతుంది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కీలక సమావేశానికి ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జులు, అనుబంధం సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కోఆర్డినేటర్లు, సభ్యులు, జిల్లా కమిటీ కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు.