Telangana: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు కాంగ్రెస్ లో చేరామని చెప్పుకోలేక, అటు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకోలేక.. ఎటూ తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. మరో పార్టీలో చేరడం దేశంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో సాధారణ అంశంగానే మారిపోయినప్పటికీ.. న్యాయస్థానాల జోక్యంతో ఇప్పుడది చర్చనీయాంశమైంది. ఓవైపు కోర్టు ఆదేశాలతో స్పీకర్ దశలవారీగా విచారణ కొనసాగిస్తుండగా.. మరోవైపు నైతికత అంశం వారిని ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను స్పీకర్ ప్రసాద్‌కుమార్ విచారించిన అంశం చర్చనీయాంశంగా మారింది.
Telangana: 2023 శాసనసభ ఎన్నికల్లో నాటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఓటమిపాలు కావడం, కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకొని అధికారాన్ని దక్కించుకోవడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ కు బొటాబొటి మెజారిటీ మాత్రమే ఉండడంతో.. ఆ పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు తెరతీసింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను 10 మందిని దశల వారీగా కాంగ్రెస్ లో చేర్చుకుంది. మంత్రి పదవుల కోసమో, కాంట్రాక్టుల కోసమో, మరే ఇతర కారణాలతోనే తమ ఎమ్మెల్యేల్లో ఎవరైనా తోక జాడిస్తే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం రాకుండా ముందుజాగ్రత్తగా వీరిని కాంగ్రెస్ లోకి తీసుకుంది. గతంలో బీఆర్ఎస్.. తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లే తాము కూడా చేర్చుకున్నామని చెప్పాలని చూసింది. అయితే పరిస్థితి గతంలో కేసీఆర్ కు అనుకూలించినట్లుగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలించలేదు.
Telangana: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి రెండు పర్యాయాలు అధికారం దక్కంచుకున్న కేసీఆర్.. ఫిరాయింపులను ప్రోత్సహించారు. నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ తోపాటు టీడీపీ, సీపీఐ సభ్యులనూ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి వంటి వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయినా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. మూడింట రెండొంతులు అనే నిబంధన వారిని కాపాడింది. ఆయా పార్టీల నుంచి రెండొంతుల కంటే ఎక్కువ మందే బీఆర్ఎస్ లో చేరడంతో వారిపై అనర్హత వేటు పడలేదు. కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
Telangana: ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కూడా మూడింట రెండొంతుల మందిని చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ, బీఆర్ఎస్ తరఫున ఏకంగా 34 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో రెండొంతుల మంది అంటే కనీసం 23 మంది పార్టీ ఫిరాయిస్తేనే ఎవరిపైనా అనర్హత వేటు పడకుండా ఉంటుంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ లో చేరడంతో వారిపై బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగింది. నైతికంగా చూస్తే బీఆర్ఎస్ కు ఆ హక్కు లేకపోయినా.. చట్టపరంగా పోరాడే హక్కు మాత్రం ఉంది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనంటూ పట్టుబడుతోంది.
Telangana: మరికొంతమంది ఎమ్మెల్యేలను లాగడం ద్వారా ఈ ప్రమాదం లేకుండా చూడాలని రేవంత్ రెడ్డి భావించారు. కానీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి, పాత కాంగ్రెస్ నేతలకు పొసగని పరిస్థితి నెలకొంది. పలు చోట్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వారిపై పోటీ చేసి ఓడిపోయిన వారికి వైరం ఏర్పడింది. కొత్తవారిని కాంగ్రెస్ నేతలు సహించని పరిస్థితి తలెత్తింది. దీంతో ఇతర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరే విషయంలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇదే అదనుగా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం ప్రారంభించింది. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో దీనిపై ఏదో ఒకటి తేల్చాల్సిన తప్పనిసరి పరిస్థితి స్పీకర్ పై పడింది. జాప్యం చేస్తున్నారన్న కారణాలతో స్పీకర్ కూడా కోర్టు నోటీసులు అందుకోవాల్సివచ్చింది. దీంతో వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనంటూ స్పీకర్ తీర్పులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎమ్మెల్యలేపై విచారణ పూర్తికాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం పెండింగ్ లో ఉంది.
Telangana: ఇప్పటికే మెడపై అనర్హత కత్తి వేలాడుతుండడంతో ఆందోళనలో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు.. స్థానిక కాంగ్రెస్ నేతలతో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఎమ్మెల్యేల నీడను కూడా సహించలేని స్థితికి అక్కడి నేతలు వచ్చారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీ నాయకత్వం పిలవడంతో ఆయన హాజరయ్యారు. కానీ, దీనిని సహించలేని జీవన్ రెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. మరోవైపు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. స్థానిక కాంగ్రెస్ నేతలతో పొసగక తాను కాంగ్రెస్ లో చేరి తప్పు చేశానని బహిరంగంగానే అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితులే దాదాపు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఎదురవుతున్నాయి. దీంతో తాము ఎటూ కాకుండా పోయామన్న వేదనలో వారు ఉన్నారు. నైతికంగా ఇది తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
