Supreme Court: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సభలో బీజేపీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొంటూ 1951 ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ 125 కింద హైదరాబాదు ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు నమోదు అయింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, రాజకీయ ప్రసంగాల్లో అతిశయోక్తులు సహజమని, వాటిని పరువునష్టం కోణంలో చూడలేమని హైకోర్టు కేసును కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: జమ్మూకశ్మీర్ కుల్గాంలో ఉగ్రవాది హతం, భద్రతా దళాల భారీ ఆపరేషన్
సోమవారం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. రాజకీయ వాదోపవాదాలను న్యాయస్థానాల్లోకి లాగడం సరైన పద్ధతి కాదని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మలచరాదని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, ఈ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం పిటిషన్‌కు తుదికట్టుపడినట్లైంది.