Telangana Cabinet:ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఆరు స్థానాలకు నాలుగు స్థానాల భర్తీకి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్. మరో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన. వారి స్థానంలో మరో ఇద్దరి నియామకం. ఇప్పటికే జాబితా ఖరారు. అధిష్టానం వెల్లడించడమే తరువాయి.. ఇవీ గత నెల మూడోవారంలో తెలంగాణ అంతటా చర్చనీయాంశమైన విషయం. ఉగాది వెళ్లింది. నవమీ దాటింది. అనుకున్న గడువు రెండు వారాలు మించిపోయింది. కానీ, మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఎందుకు ఆగింది? ఎవరు అడ్డంకి? అన్న విషయాలను పరిశీలిద్దాం.
Telangana Cabinet:తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై గత నెలలోనే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మార్చి 30న ఉగాది పర్వదినం సందర్భంగా లేదా ఏప్రిల్ 3, 4 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియా, విశ్లేషణలు, రాజకీయ ప్రతినధులు కోడై కూశారు. ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యానాలు చేసేశారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఉత్తమ్ మీడియా చిట్‌చాట్‌లో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తమ నోటితోనే చెప్పడంతో ధ్రువీకరణగా భావించారు. ఇక తాము చూసుకుంటాం, జాబితా ఫైనల్ చేసి పంపుతాం.. మీరు వెళ్లండి.. అని అధిష్టానం చెప్పి, రాష్ట్ర నేతలను పంపిందని తెలిసింది.
Telangana Cabinet:ఈ దశలో సామాజిక సమీకరణాలు, జిల్లా ప్రాతినిథ్యంపై తీవ్రమైన చర్చ జరిగింది. ఈ దశలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి తప్పక ప్రాతినిధ్యం ఉంటుందని భావించారు. అందుకే వివేక్ వెంకటస్వామి, సుదర్శన్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు పేర్లలో ఇద్దరు ఖరారవుతారని విస్తృత ప్రచారం జరిగింది. దక్షిణాది నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాతినిథ్యం లేకపోవడంతో ఓ మైనార్టీకి అవకాశం ఇస్తారని తెలిసింది. అదే విధంగా ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని విశేష ప్రచారం జరిగింది.
Telangana Cabinet:ఇంతవరకు బాగానే ఉన్నా, వివిధ సామాజిక వర్గాల వారీగా, జిల్లాల వారీగా ప్రాతినిథ్యం కోసం ఏకంగా ఢిల్లీ బాట పట్టారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాల నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు ఢిల్లీ పెద్దలను కలిసి తమకు ప్రాతినిధ్యం కల్పించాలని విన్నవించుకున్నారు. ఇదే దశలో మాదిగ సామాజికవర్గం నేతలు తమను దూరం చేసుకోవద్దని ఢిల్లీ పెద్దలను వేడుకున్నారు. గిరిజన నేతలు కూడా తమకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించడం లేదంటూ ఢిల్లీలో నిలదీసినంత పనిచేశారు.
Telangana Cabinet:దీంతోపాటు ఏకంగా సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఢిల్లీ అధిష్టానానికి లేఖ రాయడం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి మండలి విస్తరణలో ప్రాతినిధ్యం కల్పించాలంటూ ఆయన లేఖ రాశారు. ఈ దశలో అధిష్టానం పునరాలోచనలో పడినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవంగా రంగారెడ్డి జిల్లా నుంచి గెలుపొందిన నలుగురిలో రామ్మోహన్‌రెడ్డి మినహా మిగతా ముగ్గురు కొత్తవారే. ఇదే దశలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రిమండలిలో ఎక్కువ మంది ఉండటం. సీఎం సహా కీలక శాఖలు వారి వద్దే ఉండటం గమనార్హం.
Telangana Cabinet:ఇదే దశలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడైన రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఉన్నది. ఇదే దశలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సతీమణి సీనియర్ ఎమ్మెల్యే అని, ఆమెకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారని ప్రచారం జరిగింది. ఈ తటపటాయింపుల నడుమ అసమ్మతిని రాజేసినట్టవుతుందనే కారణంతో అధిష్టానం విస్తరణను వాయిదా వేసినట్టు చెప్తున్నారు.
Telangana Cabinet:వాస్తవంగా ఉగాది తర్వాత ఏప్రిల్ నెల మొదటి వారంలో విస్తరణను ప్రకటించే ముందే జానారెడ్డి లేఖతో అధిష్టానం పునరాలోచనలో పడ్డట్టు ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలే ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ధర్మరాజుగా సలహాలు ఇవ్వాల్సింది పోయి, ద్రుతరాష్ట్రుడిలా జానారెడ్డి మారారని ధ్వజమెత్తారు. తనకు మంత్రిపదవి రాకుండా అడ్డుకుంటున్నారని అనకనే అనేశారు. దీంతో మహాసముద్రం లాంటి కాంగ్రెస్‌లో ఇలాంటివి సహజమేనని ఆ పార్టీ సీనియర్ నేతలతోపాటు విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు.
Telangana Cabinet:ఇదే దశలో హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు రావడమూ మంత్రివర్గ విస్తరణకు అడ్డంకిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడం, అధిష్టానం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం, పార్టీ ప్రతిష్ఠ కొంత దెబ్బతిన్నదని వారు భావించారు. అందుకే మంత్రి వర్గ విస్తరణకు ఇది కూడా ఒక అడ్డంకిగా భావిస్తున్నారు. దీంతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం అదిగో పులి.. ఇదిగో తోక.. అన్న చందంగా మారిందని అనుకుంటున్నారు.