Telangana Cabinet: అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి భేటీ కానున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోటా అంశంపైనే మంత్రిమండలి చర్చించే అవకాశం ఉన్నది. బీసీ రిజర్వేషన్ల కోటాపై ఒకవైపు హైకోర్టు స్టే విధించగా, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుపైనా చర్చించనున్నది. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు స్టే విధించిన అనంతరం జరిగే భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది.
Telangana Cabinet: హైకోర్టు స్టే, సుప్రీంకోర్టులో పరిణామాలపై చర్చించడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయాలపై మంత్రుల భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై వచ్చే తీర్పును బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయాలపైనా చర్చించనున్నారు.
Telangana Cabinet: దీంతోపాటు తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై కూడా క్యాబినెట్‌లో చర్చ జరుగుతుందని అంచనా. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఉప ఎన్నిక ఇదే కావడంతో దీనిని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అదే విధంగా వానకాలం సీజన్‌లో వరి, పత్తి దిగుబడులు వస్తున్నందున కొనుగోళ్ల అంశంపైనా చర్చిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గత వానకాలంలో కురిసిన వర్షాలతో ఏర్పడిన రోడ్ల గుంతలపై ఫోకస్ పెట్టేందుకు చర్చిస్తారని తెలుస్తున్నది.