Revanth Reddy

Telangana Cabinet: మేడారం వేదికగా తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు అవకాశం

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సాధారణంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగే ఈ సమావేశాన్ని, ఈసారి ప్రతిష్టాత్మకమైన ‘సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర’ నేపథ్యంలో అక్కడే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 28 నుంచి జాతర ప్రారంభం కానున్న తరుణంలో, అమ్మవార్ల సన్నిధిలో మంత్రివర్గం కొలువుదీరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి పర్యటన వివరాల్లోకి వెళ్తే.. 18వ తేదీ ఉదయం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ, సీపీఐ వంద ఏళ్ల వేడుకల్లోనూ పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం కల్లా ముఖ్యమంత్రి తన మంత్రివర్గంతో కలిసి మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల సమయంలో అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చించనున్నారు. మరుసటి రోజు 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం అనంతరం, ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, అదే రోజు రాత్రి దావోస్ పర్యటనకు బయలుదేరుతారు.

ఈ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు, అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉండటంతో, దానికి తగ్గట్టుగా రాష్ట్ర బడ్జెట్‌ను ఎలా రూపొందించాలో శాఖల వారీగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల, రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధి (హ్యామ్ రోడ్లు) వంటి ప్రజాప్రయోజన అంశాలపై ప్రభుత్వం ఈ సమావేశంలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *