TG News: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈరోజు (శుక్రవారం, జూలై 25, 2025) మధ్యాహ్నం జరగాల్సిన ఈ భేటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయిదా వేసినట్లు సచివాలయ వర్గాల సమాచారం. రాష్ట్రానికి చెందిన ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉన్నందున, సమావేశానికి అవసరమైన కనీస సభ్యుల (కోరం) సంఖ్య సరిపోకపోవచ్చని అంచనా వేసి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
వాయిదా పడిన క్యాబినెట్ సమావేశం ఈ నెల 28వ తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Also Read: Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపు
ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఢిల్లీలో ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ముఖ్యమంత్రితో సహా మొత్తం ఆరుగురు కీలక వ్యక్తులు ఢిల్లీలో ఉండటంతో ఈరోజు సమావేశం నిర్వహించడం సాధ్యం కాదని భావించారు.
అనేక కీలక అంశాలపై చర్చించడానికి క్యాబినెట్ సిద్ధంగా ఉన్నప్పటికీ, మంత్రులందరూ అందుబాటులో లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాబోయే సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.