Kaleshwaram Project: తెలంగాణలో ప్రముఖ ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కీలకంగా స్పందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు.
ఏసీబీనా? లేక సిట్‌నా?
కమిషన్ నివేదిక ఆధారంగా ఎవరి పైన ఎలా విచారణ జరపాలన్న దానిపై స్పష్టత తీసుకొచ్చేందుకు, మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసును అవినీతి నిరోధక శాఖ (ACB) విచారించాలా లేక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలా అనే విషయంపై కీలకంగా చర్చించనున్నారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు?
కాళేశ్వరం విషయమై శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచన కూడా సర్కారులో ఉంది. ప్రజలకు నిజాలు వెల్లడించడానికి ఇది సరైన వేదికగా ప్రభుత్వం భావిస్తోంది. కమిషన్ నివేదికను సభ్యులకు అందించి, దానిపై విస్తృతంగా చర్చించాలన్న యోచనలో ఉంది.
ఇది కూడా చదవండి: Joe Root: సంగక్కర రికార్డును బ్రేక్ చేసిన రూట్
బాధ్యులపై చర్యలు
నివేదిక ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్లతో పాటు పలువురు ఉన్నతాధికారుల పాత్రలపై కూడా చర్చ జరగనుంది. ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్, హరిరామ్ లాంటి అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇక మిగతా అధికారులపై కూడా చర్యలకు తలంపు ఉందని సమాచారం.
ఇది తొలి సారి
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకే ఒక్క అంశంపై క్యాబినెట్ భేటీ జరగనుందన్నది ఇదే తొలిసారి. ఇది కాళేశ్వరం అంశాన్ని ప్రభుత్వం ఎంతటి గంభీరతతో తీసుకుంటుందో చూపిస్తోంది.