Cabinet Meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ సమావేశం పలు ముఖ్య అంశాలపై దృష్టి సారించనుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్, రైతు భరోసా, కాళేశ్వరం పునరుద్ధరణ పనులు, SLBC, SRSP ప్రాజెక్టుల పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చ జరగనుంది.
రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై (42%) రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత విధానం కొనసాగించాలా లేదా కొత్త రిజర్వేషన్లతో పోవాలా అనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, గత భేటీలో తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్ పై రేపటి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Also Read: Jubilee hills: టెన్షన్ టెన్షన్.. కొనసాగుతున్న నామినేషన్ల పరిశీలన..
అలాగే, పలు అభివృద్ధి ప్రాజెక్టులు, ముఖ్యంగా కాళేశ్వరం పునరుద్ధరణ, SLBC పునరుద్ధరణ పనులు, SRSP రెండో దశకు రాంరెడ్డి దామోదర రెడ్డి పేరు పెట్టడం వంటి ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించేందుకు ప్రజలకు హామీ ఇచ్చిన పథకాల అమలుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి, రేపటి కేబినెట్ సమావేశం తెలంగాణ రాజకీయాల దిశను నిర్ణయించే కీలక భేటీగా మారనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.